హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఇక శనివారం.. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడేఅవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలిపింది.