హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
ఇక ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేల, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసేఅవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.