
యాదాద్రి/భద్రాచలం, డిసెంబర్ 25: ధనుర్మాసోత్సవాలతోపాటు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. శ్రీవారి ఖజానాకు రూ.23,13,141 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ వీధుల్లో భక్తులు బారులు తీరారు. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాపికొండల విహారయాత్ర ప్రారంభం కావడంతో భద్రాచలానికి తాకిడి పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.