Heavy Rains | హైదరాబాద్ : గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. వరి ధాన్యం తడిసి ముద్దైపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది.