Rain | హైదరాబాద్, జూలై 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఎరగట్లలో అత్యధికంగా 8.71 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో లోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ వాగును దాటుతున్న ఓ కారు కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ వాగులోని చెట్ల పొదల్లో కారు చిక్కుకుపోవడంతో అందులో ఉన్న ఐదుగురు ఊపిరి పీల్చుకున్నారు. వీరిని కాపాడటానికి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.