హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఆదిలాబాద్, కుమ్రుం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ కేంద్రం స్పష్టంచేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
అక్టోబర్‌లోనూ వర్షాలు
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకూ కొనసాగే అవకాశం ఉండటంతో అక్టోబర్‌లోనూ వర్షాలు కురి సే అవకాశముందని భారత వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో రుతుపవనాల వర్షపాతం లా నినా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల తిరోగమనంలో లా నినా అభివృద్ధి చెందితే.. అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. సెప్టెంబరు 3-4 వారాల్లో, అక్టోబర్ ప్రా రంభంలో భారీ వర్షాలు కురిస్తే, అప్పటికే చేతికొచ్చే పంటలకు, విత్తిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఫిలిప్ క్యాపిటల్ ఇండియాలో కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని బన్సోద్ మీడియాకు తెలిపారు. వర్షాలు, వరదలతో ఏర్పడే పంటనష్టం కారణంగా ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని అంచనా వేస్తున్నారు.