Rain Alert | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కొన్ని గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా అనవసర ప్రయాణాలు నివారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఓపెన్ డ్రెయిన్లకు దూరంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
గడిచిన 24గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురువగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 11.19 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో 11.14 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10.70 సెం.మీ, హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 10.46 సెం.మీ, జనగామ జిల్లా నర్మెట్టలో 10.16 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 9.57 సెం.మీ, కొమురవెల్లిలో 8.83 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.