Red Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా వాయుగుండంగా బలహీనపడింది. ఆరుగంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మంకు 100 కిలోమీటర్లు, ఒడిశా మల్కాన్గిరికి 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా తుపాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. వాయుగుండం నేపథ్యంలో రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఒకటిరెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇప్పటికే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జనం ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.