Rain Alert | తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. దాంతో పాటు కర్నాటక, తమిళనాడుతో పాటు దక్షిణ మధ్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Read Also : KTR | రేవంత్ రెడ్డిపై ఎన్డీఏ ఈసారైనా చర్యలు తీసుకుంటుందా..? : కేటీఆర్
శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. నల్గొండ, సూర్యాపేట, మహూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Read Also : Harish Rao | జహీరాబాద్‌లో రైతుల అరెస్టు.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని చెప్పింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ 127.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 124.3 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.