Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ముఖ్యంగా ఆల్వాల్‌లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్‌లో గంటన్నర ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. దీంతో వర్షపు నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం పడింది. దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాల కారణంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అత్యధికంగా 13.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. మెదక్‌లో 12.6 సెం.మీ., కామారెడ్డిలో 10.50 సెం.మీ., సిద్దిపేటలో 9, జగిత్యాల జిల్లా పూడూరులో 8.9 సెం.మీ., సంగారెడ్డిలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శనివారం నాడు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.