హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా.. దాదాపు అన్ని జిల్లాల్లోనే తొలికరి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఖమ్మం, మేడ్చల్-మల్కాజిగిరి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ 9.15, చర్లపల్లి 9, కామారెడ్డి జిల్లా బిచుకుంద, జుక్కల్ 8, ఖమ్మం7.63 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దక్షిణ యూపీ నుంచి తూర్పు మధ్య ప్రదేశ్ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు సముద్ర మట్టంనుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర- దక్షిణ ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
వీటి ప్రభావంతో బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 18వ తేదీ వరకు ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలుప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వివరించింది.