రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రగతి నగర్, సాయినగర్‌లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరంది. పాతబస్టాండ్ ప్రాంగణమంతా వరద నీళ్లే. అంబికానగర్, శాంతినగర్, పెద్ద బజార్, అంబేద్కర్ నగర్, వెంకంపేట, పద్మానగర్‌లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. భారీగా వరద నీరు చేరడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలో వర్షాల కారణంగా ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నంబర్ 9398684240 ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.