Rain Alert | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురియవచ్చని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతాయని వివరించారు.