నమస్తే నెట్వర్క్, ఆగస్టు 16: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు, కాలనీలు, ఇండ్లు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో 17.4 సెంటీమీటర్లు, తలమడుగులో 15.2 సెంటీ మీటర్లు, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో 15 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.54 సెంటీ మీటర్లు, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు గ్రామాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది వద్ద ఓ ఇంట్లో చిక్కుకున్న ఆరుగురిని డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.
ఇచ్చోడ గిరిజన బాలికల గురుకుల కళాశాల భవనం చుట్టూ వరద చేరడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మోకాలు లోతు నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లారు. హాస్టల్‌కు చేరుకుని సిబ్బంది, విద్యార్థినులతో మాట్లాడారు. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన అనిత ప్రమాదవశాత్తు ఇంటి మెట్లపై నుంచి జారి పడగా అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను నిపాని వాగు దాటించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆసిఫాబాద్‌లోని రాజూర, రెబ్బెనలోని నంబాల, కెరమెరిలోని లక్మాపూర్, అనార్పల్లి, జైనూర్లోని గౌరి-లెండిగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా 16 గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు రెబ్బెనలోని ఎన్టీఆర్ కాలనీలో సహాయక చర్యలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలోని రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంపూర్ ఓసీపీలో 10 వేల టన్నులు, ఇందారం ఓసీపీలో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన గంగాధర్(45) గల్లంతయ్యాడు. జగిత్యాల జిల్లా తుంగూర్, కండ్లపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఇరువైపులా మట్టి కూలిపోయి వాహనాల రాకపోకలు నిలిచాయి. ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో జోరువాన కురిసింది. కామారెడ్డి జిల్లా ధన్నూర్ శివారులో సుమారు 80 ఎకరాల వరకు సోయా పంట నీట మునిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గల పురాతన శివాలయం నీట మునిగింది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. దీంతో ఆలయాన్ని మూసి వేశారు.
వీడని వాన ముప్పు; మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణను వాన ముప్పు వీడడం లేదు.. ఇప్పటికే వారం రోజులుగా దంచి కొడుతున్న వానలు మరో మూడ్రోజులపాటు కొనసాగనున్నాయి.. ఈ మేరకు శనివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కొనసాగుతుండడం, దీనికితోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు వెల్లడించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాగల 24గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.