హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల రోడ్లు చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలకు నీరు చేరి, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇండ్లల్లోని సామగ్రి నీటిలో తడిసిపోయింది. ఖాజాగూడలోని హరిజన్ బస్తీ నీట మునిగింది. మణికొండ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మెహదీపట్నం, జూబ్ల్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి వర్షం కుదిపేసింది. ముషీరాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, జవహర్‌నగర్ రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్‌లో అత్యధికంగా 12.1 సెంటీమీటర్లు, జవహర్‌నగర్‌లో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ వెల్లడించింది.
ప్రధాన రహదారుల్లో మోకాలులోతు నీరు నిలిచింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి మేడిపల్లి వరకు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌తో జనం అవస్థలు పడ్డారు. భారీ వర్ష సూచనలు ఉన్నప్పటికీ ముందస్తు ముంపు నివారణ చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అలసత్వం స్పష్టంగా కనిపించిందని నగరవాసులు మండిపడ్డారు. ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాలో గతంలో డీఆర్ఎఫ్ బలగాలు మోహరించేవని గుర్తుచేసుకున్నారు.
వర్షం పడగానే డ్రెయిన్‌లోకి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకునేవారని, ట్రాఫిక్ పోలీసులను కూడా భాగస్వాములు చేసుకుంటూ సమన్వయంతో పనిచేసేవారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం, జీహెచ్ఎంసీ వద్ద వర్షాకాల సన్నహాక ప్రణాళిక లేకపోవడంతో వర్షం వచ్చిన ప్రతీసారి నగరవాసులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సోమవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. ముషీరాబాద్‌లోని వినోభానగర్‌కు చెందిన దినేశ్(23) మోటార్ సైకిల్‌తో పాటు కొట్టుకుపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న దినేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నాడు. జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హబీబ్‌నగర్ నాలాలో మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిసింది.