Rain Update | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో 23న ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల ఈ నెల 23 నుంచి 26 వరకు దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, కర్నూలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మరోవైపు శనివారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బంది పడ్డారు.