హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ము ఖం చాటేశాయి. దీంతో రైతన్న వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా మంగళవారం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీనికి అదనంగా ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అకడకడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 9.45 సెం.మీ, నిజామాబాద్ జిల్లా మోస్రాలో 8.32 సెం.మీ, వర్షపాతం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూన్ నెలలో దేశవ్యాప్తంగా 46 శాతం లోటు వర్షపాతం నమోదవ్వగా, తెలంగాణలో 9 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. జూన్ నెలలో సోమవారం వరకు 124.6 మి.మీ కురవాల్సి ఉండగా 113.0 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు.