హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండు అల్పపీడనాల ప్రభావంతో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, మరింత జోరందుకోనున్నాయని పేర్కొన్నది. ఈనెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడుతుండటం, వీటికి రుతుపవనాలు తోడుకానున్నట్టు తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కర్ణాటకలో ఈనెల 12నుంచి 15వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని, దీంతో వరదలు సంభవించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
తమిళనాడు, పుదుచ్చేరి, గోవాలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం నుంచి 13 మధ్య రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. బుధ, గురువారాల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ-గద్వాల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. మంగళవారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ వెల్లడించింది.