హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని షిరిడీసాయి నగర్‌కు చెందిన 450 మందిని, ములుగు జిల్లాలోని కొండాయి గ్రామంలో మరో 150 మందిని సురక్షితంగా బోట్ల ద్వారా కాపాడినట్టు తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరాలోని ఇందిరమ్మకాలనీలో మరో 50 మందిని, వంగవీడులో ఐదుగురిని సూర్యాపేట జిల్లా కోదాడ సమీప గ్రామాల్లో 14 మందిని, , ఖమ్మం అర్బన్‌లో ఇద్దరు, కామారెడ్డిలో ఒకరు, మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఐలందలో నలుగురు, మహబూబాబాద్ జిల్లా బీచురాజుపల్లిలో 9 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించినట్టు ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. అత్యవసరమైతే వెంటనే 101కి కాల్ చేయాలని సూచించారు.