హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా (Montha Cyclone) కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు (Hevy Rain) కురుస్తాయని పేర్కొన్నది. వాయుగుండం ప్రస్తుతం పోర్టు బ్లేయర్కి 620 కి.మీ, చెన్నై తూర్పు ఆగ్నేయ దిశగా 780 కి.మీ, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 830 కి.మీ, కాకినాడకు ఆగ్నేయ దిశలో 830 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. గంటకు 6 కి.మీ వేగంతో దూసుకొస్తున్న వాయుగుండం ..రాబోయే 12గంటల్లో (సోమవారం ఉదయం) నైరుతి, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనున్నదని, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసినట్టు వెల్లడించింది.
వాయుగుండం తీరం దాటి సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా మంగళవారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది.