హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకోవచ్చని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రుతుపవన ద్రోణి తూర్పు, ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
శుక్రవారం ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, జయశంకర్-భూపాలపల్లి, ఆదిలాబాద్, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో ఈ నెల 19% అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.