నమస్తే నెట్వర్క్, మే 27: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. జనగామ జిల్లా చిల్పూరు, పల్లగుట్ట గ్రామాల్లోని కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయ్యింది. లారీలు సరిగ్గా రాక, ధాన్యం నింపడానికి బస్తాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల చుట్టూ నీరు నిలిచింది. మల్హర్ మండలం కొయ్యూర్‌లో ధాన్యం తడిసింది. కుండపోత వర్షానికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని కొనుగోలు కేంద్రం వద్ద లారీల్లో ధాన్యం లోడింగ్ చేస్తుండగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆదిలాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో జొన్న తడవకుండా టార్పాలిన్లు కప్పారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో గొల్లపల్లి, మైలారం, చిత్తాపూర్, ఆవుడం, గంగారం గ్రామాల్లోని ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. నిర్మల్ జిల్లా కుంటాలలో వర్షానికి ధాన్యం తడిసింది. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని రైతులు వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో నువ్వుల పంటకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పల చుట్టూ వరద నీరు చేరింది. వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా జూన్ నెలలో వానలు దంచికొట్టనున్నాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటులో 108 శాతం వర్షపాతం కురవొచ్చని తెలిపింది. మొత్తంగా ఈ రుతు పవన కాలంలో దేశం దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీలలో 106 శాతం కురవొచ్చని వెల్లడించింది.
తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామం వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులు త్వరితగతిన కొనుగోలు చేయకపోవడంతో పంట నీటిపాలవుతుందని వాపోయారు. లారీల కొరతతో ఇబ్బందులు తలెత్తున్నాయని మండిపడ్డారు. ఎస్సై శ్రీకాంత్ హామీతో రైతులు ఆందోళన విరమించారు.
– సారంగాపూర్
కాంటాలైన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురం శివారు శ్రీనివాస రైస్ మిల్లు ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వర్షాలతో కల్లాల్లో ధాన్యం ఆరబోసుకున్న రైతులు ఆగమవుతున్నారని తెలిపారు. తేమశాతం రాకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు రోజుల తరబడి పడిగాపులు కాసున్నారని పేర్కొన్నారు. కాంటాలైన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే మిల్లర్లు రకరకాల కారణాలు చూపుతూ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదని మండిపడ్డారు.
-ఖానాపురం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో ఆరబోసిన జొన్న పంట తడిసి ముద్దయింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. వివిధ గ్రామాల నుంచి జొన్నల లోడ్‌తో వచ్చిన వాహనాలు వర్షం కారణంగా మార్కెట్ యార్డు ఎదుటే బారులుదీరాయి.
– జైనథ్