హైదరాబాద్,జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారాయని, దీంతో 7, 8వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్కర్నూల్, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
మిగిలిన జిల్లాల్లోనూ మోస్తారు వానలు పడుతాయని తెలిపింది. మరోవైపు గురువారం రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి.