ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) కుండపోతగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలో చికమాగన్ వాగు ఉప్పొంగింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నార్నూర్, గాదిగూడ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలలో వర్షపు నీరు చేరి జలమయమయ్యాయి. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారికే, అర్జుని, దాబా, మేడిగూడ, చిత్తగూడ, నార్నూర్లోని బాబేఝరి ప్రధాన రహదారులపై లో లేవల్ కల్వర్టులపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి ఉమ్మడి మండలంలోని జనం ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సమయంలోనే బయటికి రావాలని, సమస్యలుంటే నేరుగా సంబంధిత శాఖ లేదా డయల్ 100కి సమాచారం అందించాలని నార్నూర్ సీఐ పేందూర్ ప్రభాకర్ తెలిపారు. ఉట్నూరు మండలం దంతనపల్లి వద్ద రోడ్డుపై చెట్లు కూలిపడిపోయింది. దీంతో ఉట్నూరు నుంచి జన్నారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో 14 గేట్ల ద్వారా 1,10,849 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 6484 క్యూసెక్కుల వరద వస్తుండగా 2 గేట్లు ఎత్తి 4571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. న్నది. ఇక భారీ వరదతో స్వర్ణ జలాశయం 3 గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుండపోత వర్షాలతో పొచ్చెర జలపాతానికి నీటిప్రవాహం పెరిగింది.
కుభీర్, ఆగస్టు 16: రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుభీర్ మండల తాసిల్దార్ శివరాజ్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుబీర్తోపాటు పలు గ్రామాలను సందర్శించి గ్రామ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలను అందజేశారు.
గ్రామాలలో మట్టితో కట్టిన ఇండ్లు, పాత నివాసాలు కలిగి ఉన్నవారిని సేఫ్గా ఉన్న ఇండ్లకు తరలించేందుకు కృషి చేయాలన్నారు. చెరువుల్లోకి ఎవరిని చేపలు పట్టేందుకు వెళ్ల వద్దని, పశువులను మేపేందుకు వెళ్లకుండా గ్రామంలో దండోరా లేదా మైకుల ద్వారా చాటింపు చేయించాలని సూచించారు. గ్రామాల్లోని ఇనుప విద్యుత్ స్తంభాలను తాగకుండా జాగ్రత్త పడే విధంగా గ్రామస్తులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.