నమస్తే తెలంగాణ, నెట్వర్క, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి మొదలైన వాన.. శుక్రవారం రాత్రి వరకు పడుతూనే ఉన్నది. సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోల్ నియోజకవర్గాల్లో వాన దంచికొట్టింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సంగారెడ్డి, పటాన్చెరు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 65వ నంబర్ జాతీ య రహదారిపైకి వరద చేరింది. పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. చెరువులు, కుంటలు జలమయమయ్యాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పదిగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పుల్కల్ మండలంలో 10.1 సెం.మీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ సందర్శనను నిషేధిస్తూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
మేడిగడ్డ బరాజ్‌కు పోటెత్తిన వరద
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద పోటెత్తుతున్నది. గురువారం బరాజ్ ఇన్‌ఫ్లో 7,09,850 క్యూసెక్కులు కాగా, శుక్రవారం 8,35,800 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి వరద ఉద యం నుంచి పెరుగుతూ సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఎగువ నుంచి 7,84,920 క్యూసెక్కుల వరద వచ్చినట్టు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బరాజ్ మొత్తం 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
45 అడుగులకు గోదావరి నీటిమట్టం..
ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్సాగర్తోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి అధికంగా వరద వచ్చి గోదావరిలో చేరుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 45 అడుగులకు చేరింది. గురువారం అర్ధరాత్రి 35.90 అడుగులున్న నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 44.80 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్డుపైకి వరద చేరింది. భద్రాచలం- చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
జూరాల 35, శ్రీశైలం 8 గేట్ల ఎత్తివేత
ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,41,000 క్యూసెక్కుల వదర రాగా 35 గేట్లు ఎత్తి దిగువకు 2,40,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 14,048 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 13,792 క్యూసెక్కులు నమోదైంది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 17,100 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 579 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన సుంకేశుల బరాజ్‌కు 16,521 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 3,53,577 క్యూసెక్కులు రాగా ఎనిమిది క్రస్ట్‌గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,15,424 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
గ్రాసం కోసం.. ఏరుదాటిన గోవులు
ఆంధ్రాప్రాంతానికి చెందిన పశువుల కాపరులు తమ గోవులను మేత కోసం తెలంగాణకు తరలిస్తున్న క్రమంలో శుక్రవారం చందంపేట మండలంలో నాగార్జునసాగర్ వెనుకజలాలను దాటించారు. శ్రీశైలం అటవీ ప్రాంతం దాటుకొని తెలంగాణలోకి ప్రవేశించాలంటే 150 కి.మీ. మేర రావాల్సి ఉన్నది. దీంతో 2 కి.మీ. మేర కృష్ణాజలాలను దాటిస్తే చుట్టూ తిరగాల్సిన పని ఉండదని భావించిన పశువుల కాపరులు తమ గోవులను నాగార్జునసాగర్ వెనుకజలాల నుంచి నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం గుట్టకు తరలించారు.
ఇంటి గోడ కూలి మహిళ మృతి
భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లూర్‌లో ఇంటిగోడ కూలి మంద లక్ష్మి(42)మృతి చెం దింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గ్రామానికి చెందిన మంద దుర్గయ్య ఇంటిగోడ శుక్రవారం తెల్లవారుజామున కూలింది. పక్షవాతంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన దుర్గయ్య భార్య లక్ష్మి తలపై గోడ పడడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. దుర్గయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
రోగిని వాగు దాటిస్తుండగా
మధ్యలోనే మృతి..కుమ్రంభీం జిల్లా కెరమెరి మండలం జన్కాపూర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని దవాఖానకు తీసుకెళ్లేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన భికునాయక్(78)కు గురువారం ఛాతి లో నొప్పి రావడంతో దవాఖానకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది.