హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వాన (Heavy Rain) కురుస్తున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. అదే విధంగా వికారాబాద్ జిల్లాలోనూ అక్కడక్కడ భారీ వాన కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కాగా, మరో 2 నుంచి 3 గంటల్లో జనామ, కామారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెళ్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్‌లో తోపాటు నగరంలో అక్కడక్కడ భారీ వాన పడుతున్నది. వర్షాలతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పటాన్చెరు, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, బొల్లారంలో వాన కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.