Rain Alert | తెలంగాణలో ఈ నెల 19 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణ బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంపైనున్న ఆవర్తనం ప్రస్తుతం పరిసర ప్రాంతాలు, సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర, పశ్చిమ బంగాళాఖాతంపై సముద్రమట్టానికి 5.8 కిలోమీట్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఈ ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతంపై ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొంది.
Read Also : Harish Rao | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి బంగ్లాదేశ్ వరకు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గంగానది మీదుగా ఓ ద్రోణి.. సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. మరాఠ్వాడ, పరిసర ప్రాంతాల మీదుగానున్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. మంగళశారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Also : Srinivas Goud | కాంగ్రెస్‌వి బూటకపు మాటలు.. మండిపడ్డ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బుధవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు నల్గొండ, సిద్దిపేట, భువనగిరిలో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్ 7 సెంటీమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 6.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.