Harish Rao | తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు గోదావరి / కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు గాని, బోర్డులకు గాని సమాచారం అందించకుండానే ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు సాగుతున్నదని.. త్వరలోనే ప్రాజెక్టుకు టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014 ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి బేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, లేదా ప్రత్యేక శాసన సభా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పైన పేర్కొన్న అంశాలపై మీరు శ్రద్ధ పెట్టి తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నానని చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా ఈ కృషిలో బీఆర్ఎస్ మీకు తోడుగా నిలబడుతుందని స్పష్టం చేశారు.
నమస్కారం
తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రిగా పని చేస్తున్న మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని తలచి ఈ లేఖ రాస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి – బనకచర్ల లింకు ప్రాజెక్టును సుమారు 80 వేల కోట్ల రూపాయలతో చేపట్టి 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు వయా కృష్ణా బేసిన్ తరలించాలని తలపోసిన సంగతి, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు సమకూర్చే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రెండు లేఖలు కూడా రాసిన సంగతి మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి – బనకచర్ల లింకు ప్రాజెక్ట్ ప్రాథమిక నివేదికను (Pre-Feasibility Report) కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టుగా, కేంద్రం ఆ నివేదికను తెలంగాణ సహా అన్ని గోదావరి పరీవాహక రాష్ట్రాలకు వారి అభిప్రాయాల కోసం పంపినట్టుగా తెలుస్తున్నది.
ప్రాజెక్టు ప్రాథమిక నివేదికలో పొందుపరచిన వివరాల ప్రకారం 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు తరలించడానికి ప్రాజెక్టును మూడు సెగమెంట్స్గా విభజించారు.
1. పోలవరం జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజీకి
2. ప్రకాశం బ్యారేజి నుంచి 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన బొల్లపల్లి కృత్రిమ జలాశయానికి
3. బొల్లపల్లి జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు
ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సమర్పించమని కోరడాన్ని మీరు 13.6.25 న కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రాసిన లేఖలో తీవ్రంగా వ్యతిరేకించినందుకు, ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించకుండా నిరోధించాలని కోరినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.
గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల గోదావరి నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లనుందని సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు గోదావరి / కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు గాని, బోర్డులకు గాని సమాచారం అందించకుండానే ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు సాగుతున్నది. త్వరలోనే ప్రాజెక్టుకు టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014 ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి బేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, లేదా ప్రత్యేక శాసన సభా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా కోరుతున్నాను.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1480 టీఎంసీల నీరు లభ్యం అవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు లెక్క గట్టినారు. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 969 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలోనే వివిధ జీవోల ద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించబడినాయి. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులైతే ఉన్నాయి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కాకపోవడం వలన, కొన్ని ప్రాజెక్టులు పాక్షికంగా నిర్మాణమైనందున వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించలేదన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమానికి సాగునీటి ఆకాంక్షలే ప్రధాన చోదక శక్తిగా ఉన్నాయని మీకు తెలియనిది కాదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే లక్ష్యంతో గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టింది. గోదావరి నదిపై సదర్ మాట్, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ బ్యారేజిలను, పెన్‌గంగ నదిపై చనాక కోరాట బ్యారేజీని నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ను పూర్తి చేసి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, వరదకాలువ, చెరువుల కింద 19 లక్షల ఎకరాలను స్థిరీకరించినాము. కొత్తగా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించినాము.
శ్రీరాంసాగర్ రెండో దశ, దేవాదుల, మిడ్ మానేరు, కొమురం భీం, నీల్వాయి, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, సింగూరు కాలువ, కిన్నెరసాని కాలువ, పాలెంవాగు తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఘన్పూర్ ఆనకట్ట, స్వర్ణ, సాత్నాలా, శనిగరం, చెలిమెలవాగు ప్రాజెక్టుల కాలువల ఆధునీకీకరణ పూర్తి చేసి పూర్తి స్థాయి ఆయకట్టును సాధించింది. గోదావరి బేసిన్లో మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలో వ్యవసాయానికి అనాధిగా ప్రాణాధారంగా ఉన్న వేలాది చెరువులను పునరుద్ధరించింది. గోదావరి బేసిన్లో భూగర్భజలాలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం మంజీరా, మానేరు, కడెం, స్వర్ణ, హల్దీవాగు, కూడేల్లివాగు, పెద్దవాగు తదితర నదులు, వాగులపై కొత్తగా సుమారు 730 చెక్ డ్యాంలను నిర్మించింది. చెరువులను, చెక్ డ్యాంలను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్ డ్యాంలలో నిండుగా నీటిని సరఫరా చేసింది. ఈ చర్యల ద్వారా గోదావరి జలాల వినియోగం గణనీయంగా 600 టీఎంసీలకు పెరిగింది. గోదావరి జలాల పూర్తి స్థాయి వినియోగానికి చేయవలసినది ఎంతో ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల కాలువల తవ్వకం పూర్తి చేసి గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకురావలసి ఉన్నది.
గోదావరి బేసిన్లో తెలంగాణకు కేటాయించిన వినియోగాలు పూర్తిగా సాధించక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీల గోదావరి నీటిని తరలించడం వలన రేపటి నాడు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటైన పక్షంలో మన నీటి హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి 969 టీఎంసీల తెలంగాణ వాటాను వ్యతిరేకిస్తూనే ఉన్నది. తమ వాటా 775 టీఎంసీలను వాదిస్తున్నది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 2023 లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే గోదావరి- బనకచర్ల లింకు ప్రాజెక్టును అమలు చేసి 200 టీఎంసీలపై హక్కులను కోరనున్నది. దీని వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పొందిన వాటాకు గండి ఉన్నది.
తెలంగాణ ప్రాజెక్టులు మూడింటికి 1. కాళేశ్వరం అదనపు టీఎంసీ కలుపుకొని రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాజెక్టు నివేదిక 2. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదిక 3. బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు నివేదిక అనుమతుల కోసం కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వీటికి అనుమతులు రాకుండానే, మన వినియోగాలు పూర్తి స్థాయిని అందుకోక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం అనుమతిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. తెలంగాణ ప్రాజెక్టులకు చేసిన 969 టీఎంసీల నీటిపై హక్కులు స్థిరపరచుకోకుండా ఆంధ్రప్రదేశ్ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టునైనా అనుమతించడం ఆత్మహత్యా సదృశం కాగలదు.
ఈ సందర్భంగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకురాదలచినాను. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు [Annexure C Clause 7 (a)] ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా అవసరాలకు తరలించుకోవచ్చు. ఆ మేరకు కృష్ణా నీటిని నాగార్జునసాగర్ ఎగువన పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం అనుమతించిన రోజు నుంచే మహారాష్ట్రా 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలను బేసిన్లో ఉండే ఆయకట్టు అవసరాలకు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రమే ఉన్నది కనుక ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయి. అందుకే ఈ నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది.
గోదావరి అవార్డు Annexure C Clause 7 (f) ప్రకారం పోలవరం నుంచి 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించినట్టయితే ఆ నీటిలో కూడా అదే నిష్పత్తిలో.. అంటే 45:21:14 నిష్పత్తిలోనే కృష్ణా జల్లాల్లో వాటాను ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలు పొందే హక్కు కలిగి ఉన్నాయి. జీబీ లింకు ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి, అటునుంచి బనకచర్లకు తరలించుకుపోతున్నది కనుక పైన ప్రస్తావించిన గోదావరి అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా 112.5 టీఎంసీల వాటాను పొందే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. అప్పుడు పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించినందుకు తెలంగాణకు కృష్ణా జలాల్లో హక్కుగా లభించే అదనపు నికర జలాల వాటా 45 112.5 = 157.50 టీఎంసీలన్నమాట. ఈ జలాలను తెలంగాణ నికర జలాల కేటాయింపులు లేని ప్రాజెక్టులకు (ఎస్ఎల్బీసీ40 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు), నెట్టెంపాడు (25 టీఎంసీలు), పాలమూరు- రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీఎంసీలు)] వేటికైనా కేటాయించుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. (గోదావరి ట్రిబ్యునల్ అవార్డు Annexure C జత పరచడమైనది)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము వానాకాలంలో లభ్యమయ్యే వరద జలాలను మాత్రమే తరలిస్తామని అంటున్నది. అయితే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో ఉన్నట్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నికరజలాలు, అదనపు జలాలు అన్న కాన్సెప్ట్ లేదు. అంతర్రాష్ట్ర ఒప్పందాలలో ఉపయోగించిన పదం ‘All Waters”. ఇవి ఏవైనా కావొచ్చునని ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి గోదావరి జలాల తరలింపునకు బదులుగా కృష్ణా నికర జలాల్లో 157.5 టీఎంసీల నీటిని డిమాండ్ ను కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఉంచే అంశాన్ని పరిశీలించమని, న్యాయ నిపుణులతో చర్చించమని కోరుతున్నాను. కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసి, కేంద్ర ప్రభుత్వంతో పదేళ్లు పోరాడి ISRWD Act, 1956 సెక్షన్ 3 కింద విచారణ చేయడానికి అదనపు TOR ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పించడంలో విజయం సాధించింది. అందులో భాగంగా 45 టీఎంసీల కేటాయింపు అంశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నివేదించింది. ఆ నీటిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ను కోరింది. ఆ వరుసలోనే మరో 112.5 టీఎంసీల నీటిని కూడా కేటాయించమని ట్రిబ్యునల్ కోరేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఈ వాటాకు ఏపీ అంగీకరిస్తే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించవచ్చునని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పైన పేర్కొన్న అంశాలపై మీరు శ్రద్ధ పెట్టి తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను. రాజకీయాలకు తావు లేకుండా ఈ కృషిలో బీఆర్ఎస్ మీకు తోడుగా నిలబడుతుందని తెలియజేస్తూ.. సెలవు.
భవదీయులు
తన్నీరు హరీష్ రావు