హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. 28వరకు పలు జిల్లాల్లో తేలికపాటి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.
గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అత్యధికంగా 10.53 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, దౌలతాబాద్లో 10.48 సెం.మీ, కొడంగల్లో 7.69 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కాంగ్టీలో 10.16 సెం.మీ, నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 10.15 సెం.మీ, మహబూబ్నగర్ బాలానగర్లో 7.83 సెం.మీ, వరంగల్ జిల్లా ఖానాపూర్లో 7.69, నల్లబెల్లిలో 7.38 సెం.మీ, చెన్నారావుపేటలో 6.45 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గూడూరులో 7.46 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.