బడంగ్పేట్/నాగర్‌కర్నూల్/చౌటుప్పల్, నవంబర్ 4: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రామచంద్రగూడలోని కోటిరెడ్డి చెరువు అలుగుపారడంతో ఇండ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. కేసీ తండాలో ఉన్న కేజీబీవీ హాస్టల్లోకి భారీగా వరద చేరడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఉన్న మోడల్ స్కూల్లోకి భారీగా వరద రావడంతో కాపాడాలంటూ విద్యార్థులు కేకలు వేశారు. ఎంఈవో కస్నా నాయక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శైలజారెడ్డి తదితరులు కేజీబీవీ, మోడల్ స్కూల్‌ను సందర్శించారు. మోడల్ స్కూల్ విద్యార్థులను ఇండ్లకు పంపించారు. కేజీబీవీలోని 474 మంది విద్యార్థినులను పై అంతస్థుకు తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో దాదాపు రెండు గంటలకుపైగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కాలనీలు, రహదారులు కుంటలను తలపించాయి. చారకొండ మండలం తుర్కలపల్లిలోని పలు ఇండ్ల ఆవరణలోకి నీళ్లు చేరాయి. గ్రామ సమీపంలోని పెద్దకుంట తెగిపోవడంతో ఇండ్లను వరద ముంచెత్తింది. నివాసాల్లోని నిత్యావసర వస్తువులు, సామగ్రి, దుస్తులు, పత్తి తడిచి ముద్దయ్యాయి. తాడూరు మండలం గుట్టలపల్లి, పొల్మూరు గ్రామాల మధ్యలో లోలెవల్ కాజ్‌వేపై వరద ఉధృతిని దాటే క్రమంలో గొర్రెలు కొంత దూరం ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఊర చెరువు అలుగు పారడంతో సమీపంలోని వినాయక నగర్ కాలనీని ముంచెత్తింది. ఇండ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంపీడీవో కార్యాలయంలోకి భారీగా వరద నీరు చేరింది. కార్యాలయం మొదటి అంతస్థు సగానికి పైగా మునిగింది. కార్యాలయంలోని ఫైళ్లను మూటగట్టి తరలిస్తున్నారు. పక్కనే ఉన్న ఆర్డీవో కార్యాలయం పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. పాలశీతలీకరణ కేంద్రం, టీటీడీ కల్యాణ మండపంలోకి భారీగా వరద చేరడంతో సేవలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే రహదారిని సైతం మూసివేశారు. నీట మునిగిన ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు.