నల్లగొండ : అకాల వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఉరుముతూ కురిసిన వర్షంతో పలుచోట్ల వరదలు పారుతున్నాయి.
లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. రాత్రి కురిసిన వర్షానికి త్రిపురారం మండలం మాటురు గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో తాత్కాలిక రోడ్డుపై నుంచి వరద నీరు వెళ్తుంది.
దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ఈ వర్షంతో కొంతమేర పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అలాగే పలు చోట్ల చెట్లు రోడ్లపై విరిగిపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.