Khammam | ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం/ తిరుమలాయపాలెం/ కూసుమంచి, సెప్టెంబర్ 1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 51 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. ఈ వంతెనపై ఓ మహిళ సహా ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి దగ్గర సుమారు ఆరుగురు, వాల్యాతండా వద్ద 10 మంది, ఖమ్మం నగరంలోని డాబాల్లో సుమారు 50 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు విశాఖపట్నం నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లను రప్పిచేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్యలు చేపట్టారు.
వరద ఉధృతి కారణంగా ఖమ్మంలో కరుణగిరి వద్ద మున్నేరు వంతెన కంపించింది. ఖమ్మం నగరం సహా జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న చాలామందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మున్నేరు పరీవాహక ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. పలు కాలనీల్లో అనేక ఇండ్లు మునిగిపోయాయి. బాధితులు డాబాలపైకి ఎక్కి హాహాకారాలు చేశారు. కొన్నిచోట్ల వాహనాలు కూడా పూర్తిగా నీటమునిగాయి. గోళ్లపాడు కాలువలోకి వర్షపు నీరు చేరడంతో మురుగు పోటెత్తింది. అదంతా స్థానిక ఇళ్లోలోకి చేరింది. ఇంకొందరు కట్టుబట్టలతో ఇళ్లను వదిలి రోడ్లపైకి వచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా పంచాయతీలోని అనేక కాలనీలు వరదనీటిలో చిక్కుకోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలను బైపాస్‌రోడ్డులోని రాంలీలా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.
ఆకేరు ఉధృతికి మునిగిన రాకాసితండా
తిరుమలాయపాలెం మండలంలో మునుపెన్నడూ లేనివిధంగా భారీ వర్షం కురిసింది. మండలంలోని బీరోలు పెద్ద చెరువు, ఊర చెరువులకు గండిపడి పంటపొలాలు కొట్టుకుపోయాయి. బంధంపల్లి ఎస్సీ కాలనీ మునిగిపోయింది. కాకరవాయిలో రెండు కోళ్లఫారాలు మునిగి కోళ్లు చనిపోయాయి. ఆకేరు ఉధృతంగా ప్రవహించడంతో ఆదివారం తెల్లవారుజామున రాకాసితండా నీట మునగడంతో తండావాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుట్టలు, డాబాలు ఎక్కి ఆర్తనాదాలు చేశారు. వారిని పడవల ద్వారా రక్షించి, 80 మందిని పునరావాస కేంద్రానికి తకలించారు.
‘పాలేరు’కు వరద పోటు
పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 28 అడుగులకు పైగా నీరు వచ్చి చేరింది. సమీపంలోని ప్రజలు కట్టుబట్టలతో ఇండ్లు వదిలివెళ్లారు. నాయకన్‌గూడెంలో గుడి సమీపంలో ఇటుకలు తయారు చేస్తున్న కుటుంబం వరదలో చిక్కుకున్నది. వారిలో ఒకరిని ఎన్డీఆర్ఎస్ ఆధికారులు కాపాడారు. మరో ఇద్దరు కొట్టుకొని పోగా వారి ఆచూకీ లభ్యం కాలేదు. పెట్రోల్‌బంక్‌లో చిక్కుకున్న వ్యక్తిని మత్స్యకారులు, అధికారులు కాపాడారు. పరిస్థితి గురించి మంత్రి పొంగులేటి ఆరా తీశారు. నాయకన్‌గూడెం వద్ద పాలేరు వరద పోటెత్తి ఓ ఇంటిని చుట్టుముట్టడంతో యూఖూబ్, సైదాబీ దంపతలు, వారి కుమారుడు షరీఫ్ వెంటనే ఇంటిపైకి ఎక్కి హాహాకారాలు చేశారు. కొంతసేపటికి వరద పెరిగి ఇల్లు కూలడంతో కొట్టుకుపోయారు. వారిలో షరీఫ్ ప్రాణాలతో బయటపడగా, సైదాబీ, యాకూబ్ ఆచూకీ లభించలేదు. పాలేరు మినీ హైడెల్ వద్ద పెద్ద కాలువకు ఒకటో గండి, హట్యాతండా వద్ద రెండో గండి పడ్డాయి. దీంతో హట్యాతండా వాసులు తండాను ఖాళీ చేసి బయటకు వెళ్లారు. కూసుమంచి మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 20కి పైగా గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది.
తల్లడిల్లిన భద్రాద్రి కొత్తగూడెం
భారీ వర్షం ధాటికి భద్రాద్రి జిల్లా కూడా అతలాకుతలమైంది. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. తెల్లరేసరికి మణుగూరు పట్టణం చుట్టూ వరదనీరు చుట్టుముట్టింది. అశ్వాపురం మండలంలోని వాగులో పడి గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే మండలంలో 200 మేకలు, 30 ఎద్దులు మృతిచెందాయి. బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్‌లో 30 ఆవులు మృత్యువాతపడ్డాయి. సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది. 40 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వరద ఉధృతికి సీతారామ కాలువ కొట్టుకుపోయింది. మణుగూరు సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన నందికొల్ల రాము మంచం మీదనే మృతిచెందాడు. అశ్వాపురం మండలంలో చింతకుంట చెరువు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులపల్లిలో గుండాలకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. వాగు పక్కనే ఓ రైతు కట్టేసిన ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి. ములకలపల్లి మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రారంభించిన సీతారామ పంపుహౌస్ కాలువకు గండి పడింది. సుమారు 20 వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. పాల్వంచ మండలంలోని బండ్రిగొండ వద్ద కూడా సీతారామ కాలువకు గండి పడింది. ఇక్కడ కూడా సుమారు 30 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.