భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వాన కురిసి నేల తడవడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మవాగు పొంగింది. పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది.
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సింగరేణి ఇల్లెందు కోయగూడెం ఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 8 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియాలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లోకి కూడా భారీగా వర్షపు నీరు చేరింది. అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో సింగరేణి అధికారులు బొగ్గు ఉత్పత్తి పనులను నిలిపివేశారు. సింగరేణి ప్రాంతంలో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి డివిజన్లో 64.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరో రెండు రోజులు వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం, రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడింది.
సమ్మక్క బరాజ్‌కు పెరిగిన వరద
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నట్టు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి గోదావరిలోకి 2,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అంతేమొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఇదివరకే బరాజ్ 10 గేట్లు ఎత్తగా, ప్రస్తుతం వరద పెరగడంతో మరో 5 గేట్లు ఎత్తినట్టు ఏఈఈ సాయిరాం తెలిపారు.