పొంగిన వాగులు, వంకలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జగిత్యాల, జనగామ, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో 20 చోట్ల అతిభారీ వానలు పడ్డాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఖమ్మం నగరంలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. భద్రాద్రి జిల్లా కేంద్రం లో రైల్వే అండర్‌బ్రిడ్జి వరకు వరద ప్రవహించింది. సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. పాల్వంచ గుట్ట సమీపంలో ఓ చిన్నారి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి మృతిచెందింది. బోనకల్, జూలూరుపాడు, ఖమ్మం రూరల్, వైరా, కొణిజర్ల ప్రాంతాల్లో పత్తి, వరిచేలు నీటమునిగాయి.
నేడు భారీ వర్షం
ఉత్తర పరిసర మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో సోమవారం వాయువ్య, తూర్పు- మధ్య బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు మరో ఆవర్తనం కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. దీనికి తోడు రుతుపవనాల ద్రోణి సోమవారం బిక్నూర్, జైపూర్, గుణా, సియోని, గొందియా, గోపాల్పూర్, వాయువ్య పరిసర పవ్చి మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలోని అల్పపీడనం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
వరదప్రాంతాల్లో హెల్త్‌క్యాంపులు
వరద ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వరద నీటిలో మునిగిన బస్తీలు, కాలనీల్లోని ప్రజలకు దగ్గు, జ్వరం, జలుబు తదితర లక్షణాలు ఉన్నట్టు తేలితే వెంటనే వైరల్ ఫీవర్లు, కరోనా టెస్టులు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వైద్యాఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం డీఎంహెచ్వోలతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరద బాధితులను తరలించిన కమ్యూనిటీ, ఫంక్షన్ హాళ్లకు వెళ్లి టెస్టులు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరదలో చిక్కుకున్న విద్యార్థులు.. కాపాడిన గ్రామస్థులు
హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో సోమవారం సాయంత్రం వరద నీటిలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థులను గ్రామస్థులు కాపాడారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గజ్జి ఆకాంక్ష, మేడిపల్లి వర్షిణి, మేడిపల్లి కావ్య.. సాయంత్రం ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో పులుకుర్తి గ్రామం వైపు వెళ్లే బీటీరోడ్డుపై లోలెవల్ వంతెన దాటుతుండగా వరద నీటిలో కొట్టుకుపోయి చెట్ల మధ్యలో చిక్కుకున్నారు. అదే సమయంలో అక్కడున్న స్థానికులు వారిని గమనించి వెంటనే తాళ్ల సహాయంతో విద్యార్థులను కాపాడారు.