Heavy Rain Fall | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కన్నెపల్లి(మంచిర్యాల)లో అత్యధికంగా 23.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. భీమిని(మంచిర్యాల)లో 22.5, రెబ్బెన(కుమ్రంభీం)లో 20.2, చిట్యాల(భూపాలపల్లి)లో 18 సెం.మీ., తాండూరు(మంచిర్యాల)లో 17.3, మంగపేట(ములుగు)లో 16.4, నెన్నెల(మంచిర్యాల)లో 14.5, జంకాపూర్(మంచిర్యాల)లో 13.7, రేగొండ(భూపాలపల్లి)లో 13.3, జంబుగ(కుమ్రంభీం)లో 12.9, కుంచవల్లి(కుమ్రంభీం)లో 12.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
బుధవారం హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.