హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వర్షబీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెం.మీ వర్షపాతం నమోదయిందని టీజీడీపీఎస్ వివరించింది.
వాతావరణ శాఖ ఏపీకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో గురువారం నుంచి 8వతేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.