హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా పలకరించి విరామమిచ్చిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెల్లవారుజామున రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
శుక్రవారం నిజామాబాద్, నిర్మల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గినట్టు పేర్కొన్నారు. కాగా, గురువారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.