మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : వారం క్రిత కురిసిన వర్షాలకు నరకయాతన అనుభ వించిన మహబూబాబాద్( Mahabubabad )జిల్లా ప్రజలు ఇప్పటీ కోలుకోకపోగా, మళ్లీ వర్షం(Heavy rains )పడడంతో గజగజ వణుకుతున్నారు. జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాకేంద్రంతోపాటు బయ్యా రం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం కూడా చిరు జల్లులు పడ్డాయి. మహబూబాబాద్ పట్టణంలో 18.25సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అతి భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు.
నెల్లికుదురు మండలంలో రావిరాల, ఆలేరు, వావిలాల ప్రాంతాల్లో కాజ్‌వేలపై నుంచి వరద ఉప్పొంగడంతో మహబూబాబాద్ నుంచి నెల్లికుదురుకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు నుంచి నర్సింహులపేట, చిన్నగూడూరు నుంచి నర్సింహులపేటకు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీ, కురవి గేట్, అనంతారం రోడ్డులోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. గత వారం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు తాతాలిక మరమ్మతు పనులు చేయకముందే మళ్లీ వర్షం భారీగా కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.