మహబూబ్నగర్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నేడు జరగనున్న ప్రత్యేక గ్రామసభపై ఉత్కంఠ నెలకొంది. సర్వే నంబర్ 252లో భూములు, మల్టీపర్పస్ పార్కు భూపరిహారం పంపిణీపై వస్తున్న ఆరోపణలపై విచారణ కోరుతూ అఖిలపక్షం తీర్మానం చేయాలని నిర్ణయించడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే గ్రామసభకు ముందు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించడం చర్చనీయాంశంగా మారింది.
గ్రామసభ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో హకీంపేటకు చేరుకున్నారు. భూ వ్యవహారంలో బాధితులుగా ఉన్నవారిపై నిఘా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామసభ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతుందని భావించిన తరుణంలో పోలీసు బందోబస్తు పెరగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గ్రామసభకు సర్పంచ్ రవీంద్ర చేరుకున్నారు. వంట మనిషి కూడా గ్రామానికి వచ్చినట్లు సమాచారం.
గతంలో గ్రామసభ నిర్వహించినప్పటికీ.. తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల విషయం వార్డు సభ్యులకే తెలియని పరిస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి భిన్నంగా ఇప్పుడు సర్వే నంబర్ 252 వ్యవహారంపై బహిరంగంగా గ్రామసభ నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సర్వే నంబర్ 252లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, మల్టీపర్పస్ పార్కు భూపరిహారం పంపిణీ వ్యవహారంపై స్వచ్ఛందంగా విచారణ జరిపించాలని అఖిలపక్షం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక గ్రామసభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి స్పందించిన గ్రామస్తులు.. ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుతూ గ్రామసభ ద్వారా ప్రభుత్వాన్ని అధికారికంగా కోరేందుకు సిద్ధమయ్యారు.
మల్టీపర్పస్ పార్కు భూపరిహారం వ్యవహారంలో ఆరోపణలు వెలుగులోకి వచ్చి దాదాపు పది రోజులు గడిచినా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు విచారణ చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత అనేది కూడా తేల్చకుండా అధికారులు మౌనం వహిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులే ముందుకు వచ్చి ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి ప్రభుత్వ విచారణ కోరాలని నిర్ణయించడం అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది.
నేటి గ్రామసభ రాజకీయంగానూ కీలకంగా మారింది. భూ వ్యవహారంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని తీర్మానాలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిలపక్షం ఎలా స్పందిస్తుంది, ఆరోపణలకు రాజకీయ రంగు పులుముతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు గ్రామసభ తలొగ్గకుండా.. సర్వే నంబర్ 252లో జరిగిన వ్యవహారంపై సమగ్ర విచారణ కోరుతూ తీర్మానం చేయాలని బాధితులు, గ్రామస్తులు పట్టుబడుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు, భూబాధితులపై నిఘా, అఖిలపక్షం విచారణ డిమాండ్.. ఈ పరిణామాల మధ్య హకీంపేటలో నేడు జరిగే గ్రామసభ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.