హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నిండుకుండల్లా మారిన జలాశయాల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రం నిజామాబా ద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండ గా, 33 గేట్లను ఎత్తి 4.04 లక్షల క్యూసెక్కులనీటిని అధికారులు దిగువకు వదిలారు. పూర్తిస్థాయి సామర్థ్యం 90.313 టీఎంసీలకు ప్రస్తుతం 76.743 టీఎంసీల నిల్వ ఉన్నది. నిజాంసాగర్‌కు 42,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 8 గేట్లను ఎత్తి 40,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లికి 6.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 6.90 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి బరాజ్‌కు 8.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 60 గేట్లు ఎత్తి 8.75 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూర్‌కు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5 గేట్లను ఎత్తి 45వేల క్యూసెక్కులను వదులుతున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్భందంలోనే ఉన్నది.
కృష్ణాలో స్థిరంగా ప్రవాహాలు
కృష్ణా బేసిన్‌లోని జూరాలకు 85 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 75,765 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలానికి 89,391 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 877.50 అడుగుల వద్ద నీటి నిల్వ ఉన్నది. మూసీకి 12,044 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చింది.
గోదావరి ఉగ్రరూపం
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వంతెన పైనుంచి ప్రవహించింది. జయశంకర్ కాళేశ్వరం వద్ద 12.66 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.