నిజామాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది. అంతకు మించి ప్రవాహానికి అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహం ప్రాజెక్టు అంచుల్లో నుంచి కిందికి జారుకుంది. ఈ క్రమంలో ఆనకట్ట మట్టి పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంత గ్రామాల్లో అలజడి చెలరేగింది.
గడిచిన నలభై ఏళ్లలో చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు గరిష్టంగా 1లక్షా 73వేల క్యూసెక్కులు వరద మాత్రమే వచ్చింది. తాజాగా 2లక్షల మార్క్‌ను దాటి ఇన్‌ఫ్లో భారీ ఎత్తున వస్తోంది. గురువారం 2లక్షల 31వేల క్యూసెక్కులు మేర ఇన్‌ఫ్లో కొనసాగడంతో నీటిని దిగువకు వదిలారు.