హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి 4,64,019 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. గురువారం పది గేట్లను ఎత్తి 4,31,370 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 208.7210 టీఎంసీలుగా ఉన్నది. శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లిన నల్లగొండ జల్లా చిట్యాల పట్టణంలోని వెంకటాపురానికి చెందిన హమాలీ చొప్పరి యాదయ్య శ్రీశైలం వరదలో కొట్టుకుపోయాడు. జూరాల ప్రాజెక్టుకు 3.15 లక్షల ఇన్‌ఫ్లో రాగా 42 గేట్లు ఎత్తారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.068 టీఎంసీలుగా ఉన్నది.
ఎస్సారెస్పీకి 40 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. నాగార్జునసాగర్‌కు 3,698,66 క్యూసెక్కుల వరద వస్తుండగా 27,644 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నిల్వ 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.9534 టీఎంసీలకు చేరుకున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌కు ఇన్‌ఫ్లో 4,29,020 క్యూసెక్కులు ఉండగా.. 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 6,500 క్యూసెక్కుల వరద వస్తున్నది.
ధర్మారం/రామడుగు/బోయినపల్లి, ఆగస్టు 1: కాళేశ్వరం లింక్-2లో ఎత్తిపోతలతో దిగువన ఎల్లంపల్లి నుంచి ఎగువన మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 12,600 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. రిజర్వాయర్ గేట్లను ఎత్తడంతో అండర్ టన్నెళ్లలో గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి 12,600 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడ్డ జలాలు 5.7 కిలోమీటర్లు వరదకాలువలో 99వ కిలోమీటర్ మైలురాయి వద్ద కలుస్తున్నాయి. 6 టీఎంసీల గోదారి జలాలను మధ్యమానేరుకు తరలించిచారు. మధ్యమానేరు సామర్థ్యం 27.054 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11.53 టీఎంసీలకు చేరుకున్నది.
రామడుగు, ఆగస్టు 1: కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రీ పంప్‌హౌస్‌లో బాహుబలి మోటర్ల గొప్పతనాన్ని భావితరాలకు వివరించి, వారిలో వైజ్ఞానికతను పెంపొందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌస్‌ను ఆమె సందర్శించారు. మోటర్ల పనితీరు, విద్యుత్తు సబ్‌స్టేషన్, భూగర్భంలో మోటర్లు తదితర విషయాలను ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్ను అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టు మరో విజయం సాధించింది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల, రెండో పంపుహౌస్ ట్రయల్ రన్‌ను ఇరిగేషన్ అధికారులు పూర్తిచేశారు. ఏన్కూర్ లింక్ కెనాల్ కూడా పూర్తి కావస్తున్నది. సీతారామద్వారా గోదావరి జలాలను పాలేరుకు చేర్చి.. సాగర్ ఎడమ కాలువద్వారా కృష్ణా డెల్టా కు అందించాలన్న కేసీఆర్ సంకల్పం సాకారమవుతుంది. పూసుగూడెం పంపుహౌస్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో లక్ష్యం నెరవేరుతున్నది.