హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. గోదావరి బేసిన్ లోని ఎస్సారెస్పీకి మంగళవారం సాయంత్రం 86,530 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 24 గేట్లు ఎత్తి దిగువకు 99,880 క్యూసెక్కులు వదులుతున్నారు. మానేరుకు భారీగా వరద వస్తుండటంతో మిడ్‌మానేరులో 10, లోయర్ మానేరులో 12 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరుకు 90వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 56 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి బరాజ్‌కు 1.18 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. 25 గేట్లు ఎత్తి 67,500 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. లక్ష్మి బరాజ్‌కు 1,89,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 44 గేట్ల ద్వారా 2.07 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి
ఎగువన మహారాష్ట్రలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత నది ఉప్పొంగుతుండగా కాళేశ్వరం వద్ద గోదావరి మట్టం పెరుగుతున్నది. మంగళవారం ఉద యం 6.80 మీటర్ల ఎత్తులో పుష్కరఘాట్‌ను ఆనుకొని ప్రవహించింది. సాయంత్రం 7.98 మీటర్ల ఎత్తులో పారుతున్నది. అటు కృష్ణా బేసిన్లోనూ వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాలకు 46 వేల క్యూసెక్కులు, శ్రీశైలానికి 59 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.