నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 20 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, చారగొండ, అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట మండలాల్లో గాలివానతో వడగండ్లు పడ్డాయి. పలుచోట్ల వరి, మక్క పంటలు నేలకొరగ్గా, ఈదురు గాలులకు చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుపై, కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డులోనూ విక్రయానికి వచ్చిన మక్కలు తడిసి కొట్టుకుపోయాయి. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చాకల్‌పల్లిలో పిడుగుపడి 25 జీవాలు మృత్యువాత పడ్డాయి. రైతులు భోరున విలపించారు. పెద్దమందడి, గోపాల్పేట మండలాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండల కేంద్రంలో గాలివానకు ఓ ఇంటి గోడ కూలిపోయింది.