యాదాద్రి భువనగిరి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన 1,575కిలోల గంజాయిని పోలీసులు దహనం (Cannabis burning) చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందనాదీప్తి, అర్బన్ రైల్వే డీఎస్పీ ఎస్.ఎన్. జావీద్ సమక్షంలో యాదాద్రిభువనగిరి(Yadadribhuvanagiri )జిల్లా తుక్కాపురం పరిధిలోని రోమా ఇండస్ట్రీ మెడికల్ వేస్టేజీ కంపెనీలో ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో చందనాదీప్తి మాట్లా డారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, నల్లగొండ, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో 52 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.4కోట్ల గంజాయిని దహనం చేసినట్లు చెప్పారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల(Drugs) వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని గంజాయిని దహనం చేయడం సంతోషకరమన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు, గంజాయి క్రయక్రయాలు చేపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు అలువాటి పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.