Inter Exam Fee | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్ష ఫీజేమో రూ. 520. కానీ ఫైన్ మాత్రం రూ. 2,500!. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 35వేల మంది!. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్‌బోర్డు రెండింటి తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిటశాపంగా మారింది. ఈ ఫీజు మొత్తం విలువ రూ. 8.7కోట్లు. అంటే విద్యార్థుల నుంచి ఆ మొత్తాన్ని ఇంటర్‌బోర్డు ముక్కుపిండి వసూలు చేయనుంది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నడుస్తుండటం, అగ్నిమాపకశాఖ ఫైర్ ఎన్వోసీ జారీచేయకపోవడంతో 237 కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుమతి ఇవ్వలేదు. జూన్ నుంచి ఈ కాలేజీలు నడుస్తున్నాయి.
డిసెంబర్ దాటి జనవరి సమీపించినా ఆయా కాలేజీల వైపు ఇంటర్‌బోర్డు కనీసం కన్నెత్తికూడా చూడలేదు. వాస్తవానికి అనుమతి లేకుండా నడుస్తున్న ఆయా కాలేజీలను సీజ్ చేసి, విద్యార్థులను సమీపంలోని సర్కారు కాలేజీల్లో చేర్పించాల్సి ఉండే. ఇలా కూడా చేయకుండా ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారు. ఎట్టకేలకు జనవరి 15న ఆయా కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయా కాలేజీలు గుర్తింపు పొందేందుకు వీలు కలిగింది. అయితే ఇప్పటికే ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. ప్రస్తుతం రూ. 2,500 ఫైన్‌తో ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించే అవకాశముంది. ఇంటర్‌బోర్డు నుంచి గుర్తింపు లేకుండా కాలేజీలను నడిపిన యాజమాన్యాలు బాగానే ఉన్నా యి. కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ఇంటర్‌బోర్డు బాగానే ఉంది. కానీ ఈ కాలేజీల్లో చేరిన 35వేల మంది మా త్రం పెనుభారం మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆలస్యంగా అనుమతినిచ్చిన ఇంటర్‌బోర్డు కాలేజీల నుంచి సొమ్ముచేసుకునేందుకు ఒక్కో కాలేజీపై రూ. లక్ష జరిమానా విధించి చేతులు దులుపుకుంది.
ఫైర్ ఎన్వోసీ నుంచి కాలేజీలకు మినహాయింపునిచ్చినా మళ్లీ కథ మొదటికొచ్చింది. ఇంటర్‌బోర్డు విధించిన రూ. లక్ష ఫైన్‌ను చెల్లించలేమంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో అనుమతి పొందని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌బోర్డు అధికారులు తాజాగా ఆదేశాలిచ్చారు. దీంతో ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపునిచ్చినా ఫలితం లేకుండాపోయింది.