పెద్దపల్లి, మే10: పెద్దపల్లి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు. తోటి ఉద్యోగి కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్‌కు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజగోపాల్ కొడుకు అనుషిత్ (13) కొన్నేండ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండుసార్లు శస్త్రచికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో నెల రోజుల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. గుండె మార్పిడి చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. 20 లక్షల దాకా అవసరమని వైద్యులు చెప్పారు. వారి దయనీయస్థితిని తెలుసుకున్న కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ పిలుపుమేరకు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు రూ. 17.75 లక్షలు పోగుచేశారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ చేతులమీదుగా ఆ చెక్కును రాజగోపాల్‌కు అందజేశారు.