కల్వకుర్తి రూరల్, నవంబర్ 5: ఎస్సై ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువకుడు రన్నింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం విద్యానగర్ కాలనీకి చెందిన పవన్ (25) ఎస్సై ప్రిలిమినరీలో అర్హత సాధించి ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం విద్యానగర్ కాలనీ సమీపంలో మరో వ్యక్తితో కలిసి రన్నింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన మరో వ్యక్తి అతడిని పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. పవన్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.