హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): చట్టసభ చైర్మన్ హోదాలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోరని సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ బాధ్యతలను నిర్వహిస్తారని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఫిరాయింపు పిటిషన్లపై విచారణ చేస్తారని, ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ల విచారణ వ్యవహారాలపై కోర్టులు స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునని అన్నారు. నిర్దిష్టకాలంలో ఫిరాయింపు పిటిషన్లపై విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను మంగళవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫున గండ్ర వాదనలు కొనసాగిస్తూ, స్పీకర్ చట్టసభలో తీసుకునే నిర్ణయాలు, బయట తీసుకునే నిర్ణయాలు వేరని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీసుకునే నిర్ణయాలకు ఆ నిర్ణయాలకు సంబంధం ఉండదని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ తన ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని చెప్పారు. కడియం, దానం తరఫున న్యాయవాదులు మయూర్‌రెడ్డి, శ్రీరఘురాం వాదించారు. తదుపరి విచారణ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది.