హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల్లో సృష్టించిన విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడటంలేదు. 400 ఎకరాల భూముల్లోని అడవిని చెరబట్టి విలువైన జంతు, వృక్ష జాలంపై కొనసాగించిన దమనకాండను తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. చెట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. చదును చేసిన 120 ఎకరాల భూముల్లో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. భూముల చదును వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టేటస్కో విధించినా ఇప్పటికీ టీజీఐఐసీ పహారాలోనేఉంచారు.
ఎలాగైనా ఆ భూములను టీజీఐఐసీకి అప్పగించి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 400 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఐటీ కారిడార్‌ను ఏర్పాటుచేస్తామని చెప్తున్నారు. విధ్వంసం సృష్టించిన భూముల్లో పునరుద్ధరణ పనులకు సంబంధించిన ప్రణాళిక నివేదికను అందజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనున్నది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సర్కారు వైఖరిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని హెచ్‌సీయూ విద్యార్థలు, పర్యావరణవేత్తలు, మేధావులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టీజీఐఐసీ పహారాలోనే 400 ఎకరాలు
కంచ గచ్చిబౌలి భూములపై సుంప్రీకోర్టు స్టేటస్కో విధించింది. చదును పనులను వెంటనే ఆపేసి అక్కడి నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఆ 400 ఎకరాల భూముల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను అక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించింది. కానీ, కొంతమంది పోలీసులు, టీజీఐఐసీ సెక్యూరిటీ సిబ్బంది పహారాలోనే కంచ గచ్చిబౌలి భూములు ఉన్నాయి. విద్యార్థులను కూడా అటువైపు అనుమతించడం లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా టీజీఐఐసీ దిగ్బంధంలోనే ఉండటమేమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.